6, జనవరి 2010, బుధవారం

తెలుగు తల్లి


నగ్న నృత్యాలకు ఆనందిస్తాం
పాశ్చాత్యానికి ప్రాకులాడతాం
ఆదర్శాలకు నీళ్ళు వదిలాం
ఆత్మవంచనకు సిద్ధ పడ్డాం...

అమ్మలందరినీ మమ్మీలుగా మార్చాం
నాన్నలందరికీ డాడీలు తగిలించాం
దేశభాషలందు తెలుగు "లెస్సు" అన్నాం
అంధ్రమాతా నీ బిడ్డలమైనా
నీ పాలిట దుశ్శాసనులమైనాం...

పరుల ప్రాపకానికి పాకులాడతాం
సంస్కృతీ సంస్కారాలను తూర్పార పడతాం
ఆంధ్ర దేశ మహా స్రష్టలం
అమ్మ గౌరవం నిలుపలేని భ్రష్టులం...

తెలుగు జాతికి కాసిన కుక్కమూతి పిందెలం
మమ్మల్నెవడు మెచ్చి ఇచ్చాడు అందలం
జాతి గౌరవం నిలుపలేని వాళ్ళం
ఆంధ్రమాతా క్షమించు...
నీ ఖర్మకు మేం నీ బిడ్డలం !!


ఆవేదన


చంద్రుణ్ణి చుట్టి వచ్చాం
పాతాళం లోతులు చూశాం
కానీ మానవత్వం నేర్చుకోలేకపోయాం...

భారత భాగవతాలు చదవలేం
దేవుణ్ణి ఎలాగూ పూజించలేం
మంచితనం ఎప్పుడూ భరించలేం
కనీసం మనిషిగా బ్రతుకుటకు ప్రయత్నించం...

ఎటూ పాలుపోని ఈ విషమ పరిస్థితిలో
అంతరాత్మను చంపుకోలేని అగమ్యగోచర స్థితిలో
సుదిగుందాల మధ్య చిక్కుకుని వేదనలో
బ్రతుకు గడుపుతున్నా స్మశాన వైరాగ్యంలో !!

సైనికుడు


హృదయాన బడబాగ్ని దాల్చి
జీవితాన్ని నిత్యాగ్నిహోత్రంగా మార్చి...

క్షణ క్షణం సమిధ వలె కాలుతూ
శరీరమంతా రక్తమోడుతూ...

అడుగడుగునా అవయవార్పణ గావిస్తూ
ఒంటరిగా మృత్యువుతో పోరాడుతూ...

దేశ రక్షణకు ప్రాణాలర్పిస్తూంటాం
సైనికులం మేం ప్రానార్పణకి ప్రతీకలం !!

5, జనవరి 2010, మంగళవారం

మానవతా వాదులం


మనమంతా మానవతా వాదులం
తుపాకులను ఎక్కుపెట్టి కుత్తుకలను నొక్కిపెట్టి
ఆర్తనాదాల అశ్రువులలో ఓలలాడుతుంటాం...మానవతావాదులం...

ఎదుటివాడి రక్తంతో ఇల్లు అలికి ముగ్గు పెట్టి
వాడి పేగులను ఆభరణాలుగా మెడను పెట్టి
జాతి ఉద్ధరణకు నడుము కట్టిన ఉత్తములం
మనమంతా మానవతావాదులం...

పోలీసు, మిలిటరీ, అసామాజిక శక్తి., మరొకటి
ప్రతీవాడి అహంకారానికి రాలిపడిన తల ఒకటి
నరకటంలో మనలో మనం ఒకరికొకరు పోటి
ప్రజా మాన ప్రాణ రక్షణ చేరుకుంది గోదారి
మనమంతా మానవతావాదులం...

దిక్కులేని వారికి దేవుడే దిక్కని
ఠక్కున నమ్మి వాడి కుత్తుక కోసి
ఆ భగవంతుడి ఒడికి చేరుస్తుంటాం
ప్రభూ...మానవతావాదులం
మేమంతా మానవతా వాదులం...

అమ్మ ఆలి లెక్కే లేదు
అక్కా చెల్లి తేడా లేదు
మానానికి విలువే లేదు
తుపాకుల రాజ్యాధిపతులం
మానవతావాదులం
మేమంతా మానవతా వాదులం...

శాంతి శాంతి అంటాం
పావురాలని వండుకు తింటాం
గాంధీ తాతని పూజిస్తాం
మరో గాంధీని కాల్చేస్తాం...

మంచితనపు ముసుగు వెనుక
దాగి వున్నా రక్కసి మూక
దేశమాత భవితను రక్షిస్తుందా ఇక
అమ్మా...భారతమాత
నీ శాంతి చరిత ముగిసిందిక...

ప్రభూ..రక్షించు మమ్మల్ని
మేమంతా మానవతా వాదులం !!


4, జనవరి 2010, సోమవారం

చరిత - భవిత


ఉల్కాపాతాలు ఆవృతమవుతున్నాయి
భూప్రకంపనలు ఉధృతమవుతున్నాయి...

పాపభీతి తరిగిపోతున్న ఈ ప్రపంచంలో
కొట్టుకుపోతోంది మంచితనం రక్తాశ్రుధారలలో...

ఎత్తయిన భవంతులలో ఎద ఎత్తున్నవాళ్లెంతమంది
మహనీయులైన మహారాజులే కదా గోచీగుడ్దల పై డబ్బు దండుకుంది...

సోషలిజం తెరచాటున ఫ్యుడలిజం పనిచేస్తోంది
ఎరుపైనా పసుపైన జెండా రంగు తేడా తప్ప పార్టీలలో తేడ ఏముంది...

ధర్మం జైపూర్ కాళ్ళపై దివ్యంగా పరుగెడుతోంది
తెల్లవారు భూపాలంలో స్మశాన నిషాదం వినిపిస్తోంది ...

వేదమంత్రాల ఘోష వెనుక వేదనాభరిత జీవితాలు
బ్రహ్మ పుత్రులకు కూడా తప్పడంలేదు అగచాట్లు ...

దేశ ప్రజల భవితవ్యం అంతుచిక్కని చిదంబర రహస్యం అయిపోయింది
మన దేశ యువతలో నిర్మాణాత్మకత లోపిస్తోంది!!


30, అక్టోబర్ 2009, శుక్రవారం

బ్రహ్మ పుత్రుడా !


ద్విజుడవో దేవుడివో
ఎవడిక్కావాలి నువ్వేవడో...

డాంబికాల డింభకులకు
విద్వత్తులేని వేషధారులకు...

దాస్యం చేస్తున్న ధారుణి పై
బ్రతకపోరుతున్న బ్రాహ్మికుడా...

కత్తుల కళాకారులతో
ఎరుపెక్కిన రంగస్థలంపై...

అప భ్రంశ మేధల
లాస్య విన్యాసాలలో...

వేద పాఠాలెందుకు వెర్రివాడా
పురహితం కోరే పిచ్చివాడా!!



21, అక్టోబర్ 2009, బుధవారం

వేడుక


విశ్వంభర... విధాత
విధిగా వేస్తున్న నాటిక..

పాత్రలు మారుస్తూ
మనకు కలిగిస్తున్నాడు వేడుక..

కృశిస్తున్న కాయాన్ని
కాష్ఠ కర్మాగారాన కరిగించి..

గర్భ గృహంలో
పోత పోసిన నవ రూపంతో..

నాంది పలికి
తృటిలో మారుస్తూ కధనం..

అనంతంగా సాగుతోంది ఈ విభు కవనం !!